అమ్మఒడి లబ్ధిదారులను తగ్గించటమే ప్రభుత్వం లక్ష్యం: , స్వయంగా సీఎం ఇస్తామని చెప్పిన ల్యాప్ టాప్ లు ఏమయ్యాయి : , పాఠశాల మరుగుదొడ్లు నాడు - నేడు కార్యక్రమంలోకి రావా - టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ :


 ఆనందపురం : విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథక లబ్ధిదారులను తగ్గించటమే ప్రభుత్వ లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలుగునాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇంట్లో చదువుకున్న వాళ్ళ అందరికి పధకం వర్తిస్తుంది అని చెప్పి , అధికారంలోకి వచ్చిన తరువాత కుటుంబంలో ఒక్కరికే ఇస్తున్నారని, పధకం ప్రవేశ పెట్టినప్పుడు 15 వేలు అని చెప్పి, రెండో విడత ఇచ్చినప్పుడు పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణ పేరిట 14 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేశారు అని, ఈ మూడో విడతలో మరీ దారుణంగా 2 వేలు కోత పెట్టి 13 వేలుకు పరిమితం చేస్తుందని, జనవరి లో ఇవ్వవలసిన మూడో విడత జూన్ నెలకు వాయిదా వేసి, ఇప్పటికే పలు తేదీలను మార్చిందని, ఇవే కాకుండా వివిధ రకాల నిబంధనల పేరుతో దాదాపు లక్షల్లో విద్యార్థులకు ఈ ఏడాది అమ్మఒడి కి దూరం పెట్టటాన్ని చూస్తుంటే ఈ పథకానికి లబ్ధిదారులను తగ్గించి, తూట్లు పొడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది అన్నారు. 

 రాష్ట్ర ప్రభుత్వం నాడు - నేడు అని చెప్పి వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలల మీద ఖర్చు చేస్తున్న తరుణంలో పాఠశాలల మరుగు దోడ్లు నిర్వహణ నాడు - నేడు పథకానికి వర్తించదా అని ప్రశ్నించారు. మరి ప్రయివేటు పాఠశాలలకు ఏ విధంగా ఖర్చుపెడుతున్నారో తెలియటం లేదు అని, ఈ విషయంలో ప్రయివేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పూర్తి గా అన్యాయం జరుగుతుందని విమర్శించారు. వీటి పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.  మరోపక్క అమ్మఒడి నగదు వద్దనుకున్న వారికి ల్యాప్ టాప్ లు  ఇస్తామని స్వయంగా సీఎం జగన్ ప్రకటించారని ఇప్పుడు వాటి ఊసే లేదనన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పై చిత్తశుద్ధి లేదు అనటానికి ఇదొక నిదర్శనమని, ఈ నెల 27న విడుదల చేయనున్న అమ్మఒడి నగదును పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.