జగన్ గారు ! ఎమ్మెల్యే లు గెలిస్తేనే ముఖ్యమంత్రి అయ్యేది - విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్


 విశాఖపట్నం: ఎమ్మెల్యేలు గెలిస్తేనే ముఖ్యమంత్రి అవుతారని, ఎంపీలు గెలిస్తే అవరని విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో వైరల్ గా మారాయి. 
తెలుగుదేశం పార్టీ తరఫున గత ఎన్నికల్లో విజయం సాధించిన వాసుపల్లి తర్వాత వైసీపీలో చేరారు. అయితే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న సీతంరాజు సుధాకర్ తో విభేదాలుండటంతో ఆయన పార్టీలో ఇమడలేని పరిస్థితి ఉంది.

ఇటీవలి కాలం వరకు వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా పనిచేసిన విజయసాయిరెడ్డి మద్దతు ఉండటంతో సుధాకర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ పలు సందర్భాల్లో గణేష్ కుమార్ తన అసంతప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. విశాఖలోని ఒక ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్లిన వాసుపల్లి మీడియాతో మాట్లాడారు. సీతంరాజుతో విభేదాల గురించి వ్యాఖ్యానించమని విలేకరులు కోరగా రాజ్యసభ సభ్యులవల్ల జగన్ ముఖ్యమంత్రి అవలేరని, ఎమ్మెల్యేలు గెలవాల్సి ఉంటుందని, ఎమ్మెల్యేలవల్లే ముఖ్యమంత్రి అవుతారంటూ పార్టీకి, జగన్ కు చురకలు వేశారు. విజయసాయిరెడ్డికి ఈ విషయం ఎందుకు అర్థం కావడంలేదో తనకు తెలియడంలేదని, ఉత్తరాంధ్రకు కొత్త ఇన్ఛార్జి సుబ్బారెడ్డి అయినా ఈ సమస్యను పరిష్కరించాలని వాసుపల్లి కోరారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు వైసీపీ బాధ్యుడిగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి పార్టీలో తనకు అనుకూలంగా ఉండేవారిని ప్రోత్సహిస్తూ గ్రూపులు తయారుచేశారంటూ వైసీపీలో కొందరు నాయకులు తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. కొందరు నాయకులైతే ముఖ్యమంత్రి జగన్ కు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో కూడా సాయిరెడ్డికి విభేదాలున్నాయని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తాను విశాఖ నుంచి లోక్ సభకు పోటీచేయబోతున్నానని సాయిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా సాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించి పార్టీ జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తల మీద ఇంచార్జీ బాధ్యతలు అప్పగించారు.