*గొలుగొండ* : ఉత్తమ అధికారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు పొందిన ఆరు రోజుల్లోనే కటకటాల పాలయ్యాడు ఓ అధికారి. లంచం కేసులో ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు.
ఆయనో ప్రభుత్వ అధికారి, ఆయన కింద పదుల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తారు. ఇటీవలే ఉత్తమ అధికారిగా ప్రశంసలు అందుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు కూడా పొందారు.
కట్ చేస్తే... అవార్డు పొందిన ఆరు రోజుల్లోనే కటకటాల పాలయ్యారు. అవినీతి లంచం కేసులో ఏసీబీ కి అడ్డంగా బుక్కయ్యాడు. ఇంతటి ఘనకార్యం చేసిన ఆ అధికారి పేరు గోవిందరావు.
వెలుగు ఏపీఎం గణతంత్ర దినోత్సవం నాడు గోవిందరావుకు అవార్డు రావడంతో గొలుగొండ మండలం కి గుర్తింపు వచ్చింది. ఆ ఆనందం ఆరు రోజులు గడవకముందే ఆవిరైపోయింది. 14 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన గోవిందరావు.
ఈ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కిన మరుక్షణమే.. అతనిపై ఆరోపణలు గుప్పుమన్నాయి. వెలుగు సిబ్బందే అతగాడి అవినీతి గురించి చర్చించుకుంటూ ఉన్నారు. గొలుగొండ మండలంలో 52 మంది వరకు వెలుగు వీఏఓలు ఉన్నారు.
సభలు సమావేశాలు నిర్వహించే టప్పుడు ఒక్కొక్కరి నుంచి వెయ్యేసి వసూలు చేసేవారు అని అంటున్నారు.
దశాబ్దం క్రితం గోవిందరావు బాల బడుల నిర్వహణ చూసేవారు. అంతేకాదు పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే వస్తువులు వెలుగు కేంద్రం ద్వారా విక్రయాలు జరిగేవి.
ప్రతీచోటా చేయి తడపందే పని జరిగేది కాదు అన్నది గోవిందరావుపై ఉన్న ఆరోపణ. ఉన్నత హోదా కలిగిన వారి పట్ల సౌమ్యంగా ఉంటూనే.. వారి దగ్గర నిబద్ధత కలిగిన వ్యక్తిగా పేరు సంపాదించాడు.
కానీ నాణేనికి మరో వైపు చూస్తే మాత్రం.. అవినీతి ఆరోపణలే. తాజాగా వివోఏ నుంచి 14 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు గోవిందరావు. సరైన సమయంలో గోవిందరావు తగిన శాస్తి జరిగిందని అతని ద్వారా ఇబ్బందులకు గురి అయిన ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.