మంత్రి సిదిరి అప్పలరాజు కు అవమానం

 *టిఎన్ఎస్ఎఫ్ నాయకులు అరెస్ట్* :
 *విశాఖపట్నం* : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పర్యటన నేపథ్యంలో విశాఖపట్నం వెళ్లిన మంత్రి సిదిరి అప్పలరాజు కు అవమానకర పరిస్థితి ఎదురయ్యింది. సీఎం రాక సందర్భంగా విశాఖలోని శారదా పీఠంలోకి వెళుతుండగా మంత్రిని పోలీసులు అడ్డుకున్నారు.

 మంత్రి ఒక్కరే లోపలికి వెళ్లాలని... మిగతా నాయకులు, అనుచరులను అనుమతించేది లేదంటూ ఓ సీఐ తెలిపాడు. అయితే మంత్రి మాట్లాడుతుండగానే సదరు సీఐ దురుసుగా ప్రవర్తిస్తూ వెళితే వెళ్లండి లేకుంటే లేదంటూ ముఖం మీదే గేటు వేసి అవమానించాడు. దీంతో మంత్రి అప్పలరాజు అలిగి సీఎం పర్యటనలో పాల్గొనకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.

విశాఖ శివారులోని చినముషినివాడలోని శారదాపీఠం లో వార్షిక మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి జగన్ బుధవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రాక నేపథ్యంలో శారదా పీఠం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. ముందస్తు అనుమతి పొందినవారు, ముఖ్య నాయకులను మాత్రమే పోలీసులు పీఠంలోకి అనుమతించారు.

అయితే మంత్రి సీదిరి అప్పలరాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తన అనుచరులు, కొందరు స్థానిక వైసిపి నాయకులతో కలిసి శారదాపీఠం వద్దకు చేరుకున్నారు. కానీ ఆయనను మెయిన్ గేటు వద్దే అడ్డకున్న పోలీసులు కేవలం ఒక్కరే లోపలికి వెళ్లాల్సిందిగా సూచించారు. 

ఈ క్రమంలోనే ఓ సీఐ చాలా దురుసుగా ప్రవర్తించాడని, మంత్రి అని కూడా చూడకుండా దుర్భాషలాడినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన మంత్రి అప్పలరాజు పోలీస్ ఉన్నతాధికారులకు సదరు సీఐపై ఫిర్యాదు చేసారు.
అవమానించిన సీఐ క్షమాపణ చెప్పాలంటూ మంత్రి అప్పలరాజుతో పాటు ఆయన అనుచరులు డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా శారదాపీఠం గేటువద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సదరు సిఐ క్షమాపణలు చెప్పక పోవడంతో మంత్రి సీదిరి అప్పలరాజు అలిగి వెనక్కి వెళ్లిపోయారు.

ఇదిలావుంటే  గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ అక్కడినుండి రోడ్డుమార్గంలో శారదాపీఠం చేరుకున్నారు. సీఎం రాజ్యశ్యామలాదేవి పూజలో పాల్గొనడంతో పాటు శారదా పీఠంలో ఏర్పాటు చేసిన పండిత సభలో పాల్గొన్నారు. మద్యాహ్నం ఒంటిగంట వరకు వార్షిక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ సుమారు 2.30 గంటలకు తిరుగుపయనం అయ్యారు.

సీఎం విశాఖ పర్యటనను తెలుగుదేశం విద్యార్ధి విభాగం తెలుగునాడు విద్యార్థి సమైక్య అడ్డుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్ పోర్ట్ ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. విశాఖ పట్టణంలోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద, సీఎం వెళ్లే రూట్ లోని ప్రధాన జంక్షన్లలో పోలీసులు భారీగా మోహరించారు.

సీఎంని అడ్డుకునేందుకు ఎయిర్ పోర్ట్ కు బయలుదేరిన టిఎన్ఎస్ఎఫ్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షులు పెదిరెడ్డి నాగవెంకట రమణ తో పాటు మరికొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. సీఎం వచ్చిన సమయంలో విమానాశ్రయంలోకి కేవలం టికెట్ ఉన్న ప్రయాణికుల్నే పోలీసులు అనుమతించారు.

జి. రవి కిషోర్. బ్యూరో చీఫ్