ఆనందపురం:జనసేవ న్యూస్
మండలంలోని వేములవలస కూడలిలో రైతులు ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఉత్తరాంధ్రలోని ప్రముఖ పూల మార్కెట్ గా ఉన్న వేములవలస లో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి.
పాదచారులు నడవడానికి కూడా వీలు లేని పరిస్థితిలో ఉంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పంచాయతీ ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ రెండు గంటలపాటు అక్కడే ఉండి చూసారు.
ఫ్లైఓవర్ వంతెన పూర్తి కాకపోవడంతో భారీ వాహనాలు క్రింద నుంచి రావడంతో ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. దీనికితోడు బంటుపల్లి కి వెళ్లే రోడ్డుకు వన్వే విధించడంతో మరీ ఇబ్బందికరంగా మారిందని అన్నారు.
ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేసినప్పటికీ పరిస్థితులు మారలేదని దీనికి ప్రత్యామ్నాయ పరిష్కారం కావాలని కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ డిమాండ్ చేశారు.
మార్కెట్ కు ప్రతిరోజు వేకువజాము నుండే వందలాది మంది రైతులు వస్తుంటారని వారికి ఏమైనా జరిగితే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే నని అన్నారు.
ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ చెప్పారు.
(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )