ఫ్రెండ్స్ అసోసియేషన్ భీమిలి (ఫాబ్) నిర్మాణంలో భీమిలి విశిష్టతను తెలియజేస్తూ చిత్రీకరించిన పాటను ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి చేతుల మీదుగా ఆదివారం విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా తనికెళ్ళ భరణి మాట్లాడుతూ భీమిలి చరిత్రను తెలియజేస్తూ ఫ్రెండ్స్ అసోసియేషన్ భీమిలి చిత్రీకరించిన ఈ పాట ఆద్యంతం చాలా అద్భుతంగా ఉందని అన్నారు.
భీమిలి లోని చారిత్రక ప్రదేశాలతో పాటు, ఆనాటి గొప్ప వ్యక్తుల విశేషాలను చక్కగా చూపించారని ఆయన అన్నారు. పాట రచించిన రచయిత, మరియు సంగీత సారధ్యం వహించి గానం చేసిన వారికి, మరియు చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఫాబ్ ప్రతినిధులకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అన్నారు.
ప్రముఖ రచయిత మరియు ఫాబ్ సభ్యుడైన విశ్వనాధ శ్రీనివాస్ వ్రాసిన జయహో భీమిలి గీతానికి శ్రీమతి మూల శ్రీలత సంగీత దర్శకత్వం వహిస్తూ గాయకుడు కృష్ణారావుతో కలసి గానం చేశారు. ఈ పాట రచయిత విశ్వనాధ శ్రీనివాస్ మాట్లాడుతూ భీమిలిలో చదువుకున్న తనకు ఈ పాట వ్రాయడం చాలా ఆనందకరంగా ఉందని అన్నారు. రచయితగా ఎన్నో పాటలు వ్రాసినా తనకు ఈ పాట ఎనలేని సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. ఈ పాట భీమిలి ప్రజల మన్ననలు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఫాబ్ ప్రతినిధి సూర్య శ్రీనివాస్ ముసునూరి మాట్లాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఫాబ్ నిర్మాణంలో భీమిలి చరిత్రను తెలియజేసే ఈ పాటను చిత్రీకరించడం చాలా ఆనందంగా ఉందని, ఈ పాటలో భీమిలిలోని ముఖ్యమైన ప్రదేశాలను చూపిస్తూ, ఇక్కడ ప్రజల జీవన శైలిని కూడా చూపించే ప్రయత్నం చేశామని అన్నారు. భీమిలి ప్రజలందరూ ఈ పాటను వీక్షించి ఫ్రెండ్స్ అసోసియేషన్ భీమిలి చేసిన ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫాబ్ ప్రతినిధులు సన్నీ కాళ్ళ, కృష్ణ బుగత పాల్గొన్నారు.