ఆనందపురం : ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతల వలన విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు అని తెలుగునాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వేళాపాళా లేని విద్యుత్ కోతల వలన రాష్ట్రంలో ఉండే అన్ని రకాల ప్రజలు కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుందని అన్నారు. ఎండలు విపరీతంగా మండిపోతుంటే కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు అని, అలాగే రాత్రి పూట విద్యుత్ నిలిపివేయడం వలన చంటి పిల్లలు, వృద్దులు, పగలంతా కూలీ పని చేసుకొనే వారు ఇబ్బంది పడాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఒక పక్క పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల సమయం కావటం వలన పగలు చదువుకోవటం కుదరక, రాత్రుళ్లు ప్రశాంత నిద్ర లేక విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు అని , ఇలా పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు విధించడం తగదన్నారు. మరో పక్క పరిశ్రమలకు రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించడంతో పరిశ్రమలు వారానికి రెండు రోజులు మూతపడుతున్నాయి అని, దీని వలన కార్మికులు పని లేక ఇబ్బంది పడుతున్నారు అని తెలిపారు. అంతేకాకుండా అప్రకటిత విద్యుత్ కోత వలన రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని, ఎప్పుడు వస్తుందో రాదో తెలియని పరిస్థితి వల్ల రైతులు పొలాల్లో పడిగాపులు కాస్తూ తీవ్ర నరకయాతన ఎదుర్కుంటున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయంలో ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండేదని, విద్యుత్ కోతలు పెద్దగా ఉండేవి కాదని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్ కోతల విషయంలో పునరాలోచించాలి అని డిమాండ్ చేశారు.